23, డిసెంబర్ 2016, శుక్రవారం

ఉత్తేజిత ప్రశ్న...మా పెరియార్


ప్రశ్న కోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్తావ్
అసమానతలఫై
అంతం లేని పోరాటం ఎంతకాలం చేస్తావ్
అందరి స్వేచ్ఛ కోసం కలగన్న జాతి రత్నమా
మా ఈరోడ్ వెంకట రామస్వామి నాయకర్

దేవదాసి విధానాన్ని నిర్ములించడం కోసం
స్త్రీ సమాజ ఆభివ్రిద్ది కోసం
బతుకంతా ఆత్మగౌరవ ఉద్యమంగా మల్చుకున్నవాడా
శ్రమైక జీవన సౌందర్యం కోసం
నిరంతర ఘర్షణ పడ్డవాడా
జీవిత సత్యాల సఫలత్వం కోసం రాజీలేని పోరు జరిపినవాడా
దోపిడీ, పీడనల ఫై ఉరిమినవాడా
రచనని, మేధని
అట్టడుగుజనం విముక్తి కోసం వినియోగించినవాడా
ఉద్యమాన్ని మానవత్వ శిబిరంగా ఎగరేసినవాడా
మూఢ విశ్వాసం
బ్రాహ్మణిజం,
పురుషాధిక్యత లేని లోకం కోసం పరితపించినవాడా
ప్రతి అణచివేతని ధిక్కరించినవాడా..
మా పెరీయారు ..నీకూ దండాలు.


( నేడు పెరియార్ ఈవీ. రామస్వామి నాయకర్ వర్ధంతి)
# బహుజన రచయితల వేదిక, ఏపీ #

కళారూపంగా అంబేద్కర్‌ జీవితం .. ఆశయం ...


డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ తన యావజ్జీ వితం నిమ్న జాతుల అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, వారికి పరిపాలనలో భాగం కోసం పోరాటం చేశారు. బాల్యం నుంచి అనేక సందర్భాల్లో, ఎన్నో నిందలు, అవమానాలు పొంది, అగ్నిశిఖలా ఎగిసిన ప్రపంచ స్థాయి మేథావి ఆయన. మనుధర్మాన్ని చీల్చి చెండాడి, కులం యొక్క వివక్ష విశ్వరూపాన్ని అనేక పార్శ్వాల్లో ఆవిష్కరించిన తత్త్వవేత్త. భారతదేశం గురించి విశేష పరిశోధన చేసిన దార్శనికుడు. దార్శనికతతో ఆయన చేసిన కృషి అనితర సాధ్యం. రాజ్యాంగ నిర్మాతగా, రిజర్వేషన్‌ సాధించిన మహనీయునిగా ఆయన గురించి జరిగినంత ప్రచారం, మిగతా అంశాల్లో జరగలేదు. ఆయన 'ప్రాతినిధ్యం' అన్న పదాన్ని మాత్రమే వాడారు తప్ప 'రిజర్వేషన్స్‌' అనే పదం వాడలేదు. జీవిత చరమాంకంలో బౌద్ధమతాన్ని స్వీకరించి, బుద్ధుని యెడల తన దృక్పథం మహాయానం, హీనయానం కాదని, 'నవయానం' అని ధైర్మంగా చాటిన బౌద్ధ భిక్షువు అంబేద్కర్‌.
ఆయన 125వ జయంతిని ఈ ఏడాది దేశమంతటా ఘనంగా జరపాలని అనేక సంస్థలు భావించి తమదైన శైలిలో నివాళ్లర్పిస్తున్నాయి. ప్రజానాట్య మండలి, తెలంగాణ రాష్ట్ర శాఖ 'సంఘం శరణం గచ్ఛామి' పేరిట ఒక కళారూపాల కదంబాన్ని ప్రదర్శిస్తోంది. 25 మంది కళాకారులతో ప్రొడక్షన్‌ క్యాంప్‌ నిర్వహించి తొలి ప్రదర్శనను ఏప్రిల్‌ 14న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో కిక్కిరిసిన ప్రేక్షక సందోహం మధ్య ఇచ్చారు.
21 సీన్లతో, 13 పాటలతో ఈ సంగీత రూపకాన్ని రచించారు ప్రజాకవి 'దేవేంద్ర'. ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ఆర్‌డిఎం.రాజు వాయిస్‌ ఓవర్‌తో, సంగీత దర్శకులు ఇస్మాయిల్‌ గోనాల్‌ స్వరకల్పనలో, రవి కల్యాణ్‌ సంగీత సారథ్యంలో అన్ని పాటలూ సిడి రూపంలో రూపుదిద్దుకున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌కి చెందిన శివప్రసాద్‌ తూము దర్శకత్వం వహించారు. ఈ రూపకాన్ని గంటసేపు ఆద్యంతం రసవత్తరంగా ప్రజాకళాకారులు ద్రర్శించారు.
రూపకం ప్రారంభంలో ... అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు సాగుతూ ఉంటాయి. నిర్వాహకుడొకరు వచ్చి ఆశీనులైన ప్రేక్షకులతో - జరగబోయే కార్యక్రమాన్ని వివరించి కళాకారులను ఓ పాటను అభినయించమంటారు. కళాకారుల ప్రదర్శన సాగుతుండగా, ప్రజా ప్రతినిధులు రావడంతో మధ్యలో ఆపేయమంటారు నిర్వాహకులు. సణుక్కుంటూ వేదిక దిగుతారు కళాకారులు. విగ్రహావిష్కరణకు ముందు ఉపన్యాసాలు సాగుతాయి. ముఖ్య అతిథి అయిన మంత్రి వేరే పనుండి గాబట్టి- రెండే మాటలు మాట్లాడతానంటూ 'అంబేద్కర్‌ రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు, మిగిలినవి ఎన్ని చేసినా ఇవే ముఖ్యమైనవి..' అంటాడు. విగ్రహానికి దండ వేసి నినాదాల హౌరుతో శిరస్సు వంచి ఓ నమస్కారం చేస్తాడు. అంబేద్కర్‌ విగ్రహానికి జీవం వచ్చి, రాజ్యాంగం పుస్తకంతో మంత్రి నెత్తి మీద తడతాడు. అందరూ ఉలిక్కి పడతారు. అంబేద్కర్‌ దండను నినాదాలిస్తున్న కార్యకర్తలకు అందించి- గంభీరంగా మెట్లు దిగుతాడు.
రాజ్యాంగాన్ని టేబుల్‌పై పెట్టి- ఇలా మాట్లాడతాడు : 'అరవై ఏళ్లుగా విన్న మాటలే వినీ మళ్లీ మళ్లీ విని చెవులు దిబ్బళ్లు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరులేని వాళ్లకు నోరై పోరాడాను. పీడితుల కోసం, అణగారిన వర్గాల, మైనార్టీల అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి- నా మరణానికి ముందు చేసిన రెండు పనులనే 'రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్‌ తెచ్చాడు' అంటూ ఇంకా ఎన్నేళ్లు చెబుతారు? ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేను ఆవిష్కరించుకోవాలి.. దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికలను ఆవిష్కరించుకోవాలి.' అంటూ ముందుకు వస్తాడు. అప్పుడు ...
'యుగాల తరబడి అణచివేతపై
తిరుగుబాటురా అంబేద్కర్‌
తరాల బానిస స్వరాల ఘోషల
భాషకు రూపం అంబేద్కర్‌
నరాల సత్తువ వరాల వానకు
విషాద రాగపు సువర్ణ వీణ
అణగారిన చేతుల పిడికిళ్లకు
శక్తినిచ్చే స్ఫూర్తుల వాన' అంటూ రూపకం మొదలై ... దాదాపు గంటసేపు అవిశ్రాంతంగా నడుస్తుంది
బాల్యం, పేదరికం, తండ్రి మరణం, బరోడా మహారాజు ఆర్థిక సహాయం, అమెరికా పయనం, రమాబాయితో వివాహం, అర్థంతరంగా చదువు వదిలి స్వదేశాగమనం, బహిష్క ృత హితకారిణీ సంస్థ, సమాజ సమతాదళ్‌ ఏర్పాటు, చౌదార్‌ చెరువు సంఘటన, సవర్ణులపై చారిత్రాత్మక విజయం, మనుధర్మ పుస్తకం అగ్నికి ఆహుతి చేయడం, అంబేద్కర్‌, గాంధీల సమావేశం, చర్చలు విఫలమవ్వడం, పూనే ఒప్పందం, ఎరవాడ జైల్లో గాంధీతో భేటీ, రమాబాయి మరణం, కుల నిర్మూలన పుస్తక రచనకు మూలం, రాజ్యాంగ పరిషత్‌ ఆవిర్భావం, న్యాయ శాఖామంత్రి పదవీ స్వీకరణ, హిందూ కోడ్‌ బిల్లు వల్ల మహిళలకు అన్యాయంలో రాజీనామా; రాజ్యాంగ రచన, బౌద్ధమత స్వీకరణ తదితర జీవిత ఘట్టాలను వివరిస్తూ ... సాగుతోంది రూపకం.
ఆడియో అంతా ముందే రికార్డు అవ్వడం వల్ల కళాకారుల వాచికాభినయానికి అంత అవకాశం లేదు. ఏ ప్రాంత కళాకారులైనా రూపకాన్ని సిడి సహాయంతో ప్రదర్శించవచ్చు. సురభి టెక్నీషియన్స్‌ సహాయంతో సెట్టింగ్‌ చాలా సింపుల్‌గా నిర్మించారు. వాయిస్‌ ఓవర్‌, పాటలలో ఎక్కడా ఆగకుండా నడిచే ఈ రూపకంలో ఇద్దరు అంబేద్కర్‌ పాత్రధారులు ఉన్నారు. విగ్రహం రూపంలో ఈ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎం.జగ్గరాజు నటించగా- కథనంలో మరో నటుడు నటించారు.
20 సీన్ల కథనం తర్వాత అంబేద్కర్‌ విగ్రహంతో ఆఖరి సీన్‌ వస్తుంది. 'జయంతులు, వర్థంతులు అంటూ రెండు రోజులు మాత్రమే గుర్తుంచుకుని, మిగతా 363 రోజులూ విస్మరిస్తారా? తాను ఏ ఆశయంతో పోరాడాడో వాటి గురించి పోరాడేది ఎవరు? నెరవేర్చేది ఎవరు? నాయకులైన మీరేనా?' అని అడగగా రాజకీయ నాయకులు మౌనంగా ఉండిపోతారు. అక్కడ ఉన్న యువత, 'మేమున్నాం అంబేద్కర్‌' అంటూ ముందుకు వస్తారు. అంబేద్కర్‌ వారందరినీ తల నిమురుతూ కౌగిలించుకుంటూ, గంభీరంగా పీఠం మీదకు వెళ్లి శిలగా మారిపోతాడు. యువతీయువకులు తమ చేతిలోని దండను అంబేద్కర్‌ విగ్రహానికి వేసి- 'అంతమెరగని స్వాతంత్య్రానికి, కులమత భేదం దరికి చేరని ఆధిపత్యాలు వివక్షతలు దుంప నాశనం చేసేవరకూ .... కదిలింది యువత- నిర్మించగ సుందర భవిత' అంటూ గానంతో రూపకం ముగుస్తుంది.
ఈ రూపకంలో కొన్నిచోట్ల ఉపన్యాసంగా అన్పించినా, ఒక జీవిత కాలాన్ని ఒక్కగంటలో చెప్పేటప్పుడు కొన్ని సర్దుబాట్లు తప్పవు. ఈ రూపకంలో అంబేద్కర్‌ మొదటి భార్య రమాభాయి గొప్పదనాన్ని ఎంతో హృద్యంగా; మరణాన్ని ఎంతో విషాదపూరితంగా చూపారు. ఆమె మరణం తర్వాత 11 ఏళ్ల అనంతరం, అప్పటికే అనేక అనారోగ్య సమస్యలు ఎదురై, ఒంటరితనంతో ఉన్న అంబేద్కర్‌ జీవితంలోకి రెండో భార్యగా డాక్టర్‌ సవితాదేవి వచ్చారు. రాజ్యాంగ రచనా సమయంలో, అంబేద్కర్‌ అవసాన దశలో కంటిరెప్పలా చూసుకున్నారు. ఆమె ప్రస్తావన ఎక్కడా రాకపోవడం లోపంగానే భావించాలి.
ఈ రూపకం ఉన్న పుస్తకం, రూపకంతో పాటు మరో 14 పాటలు పొందుపరచిన డివిడిని కలిపి రూ.100లకు అందిస్తున్నారు. వాటికోసం తెలంగాణా రాష్ట్ర థియేటర్‌ సబ్‌ కమిటీని సంప్రదించవచ్చు. పుస్తకానికి ముందుమాట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు రాశారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు తమ సందేశం ఇచ్చారు.
- డాక్టర్‌ శమంతకమణి
94919 62638 
ప్రజాశక్తి   ( ) సౌజన్యం తో

22, డిసెంబర్ 2016, గురువారం

అంబేడ్కర్‌ బౌద్ధ స్వప్నం - నవయానం

అంబేడ్కర్‌ భారతదేశాన్ని బౌద్ధదేశంగా పరిగణించారు. దేశం నుంచి నిష్క్రమించిన బౌద్ధాన్ని తిరిగి ప్రతిష్టించాలని ప్రగాఢంగా ఆకాంక్షించారు. బౌద్ధాన్ని అంబేడ్కర్‌ విశ్లేషించిన తీరు వలన ప్రపంచం తిరిగి బౌద్ధం వైపు చూస్తోంది.


‘పీడిత కులస్థులు ఎప్పుడూ తమ అస్తిత్వ పునాదులపై నిలబడి పోరాడాలి తప్ప ఆధిపత్య మతాలలోకి కాందిశీకులుగా వెళ్ళకూడద’ని తమిళ దళిత బౌద్ధ ఉద్యమకారుడు పండిత అయోతీదాస్‌ అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించడానికి దశాబ్దాల ముందే అయోతీదాస్‌ ఈ సత్యాన్ని చెప్పారు.
అంబేడ్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించడం భారతదేశ బౌద్ధ మత చరిత్రలోనే ఓ కీలకమైన అధ్యాయం. బౌద్ధాన్ని ఇతరులు అర్థం చేసుకునే విధానానికీ అంబేడ్కర్‌ పరిశీలించిన పద్ధతికీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. గాంధీ, వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి వారు బుద్ధుడిని హిందూ మతంలో భాగంగా పరిగణిస్తారు. కానీ అంబేడ్కర్‌, బుద్ధుడిని బ్రాహ్మణ వాదాన్ని సవాల్‌ చేసి బ్రాహ్మణేతర తాత్విక ధోరణిని ప్రవేశ పెట్టిన సామాజిక విప్లవకారుడిగా పరిగణిస్తాడు. అంతేకాదు సామాజిక విప్లవంగా ముందుకొచ్చిన బౌద్ధాన్ని అంతమొందించి దాని స్థానంలో హిందూ మతాన్ని, దానికి అనుబంధంగా కులవ్యవస్థను స్థిరీకరించి, సామాజిక అంతరాలను చట్టబద్ధం చెయ్యడానికి బ్రాహ్మణవాదులు చేసిన ప్రయత్నాలను ‘ప్రతీఘాత విప్లవం’ గా అంబేద్కర్‌ అభివర్ణించారు.
 
ప్రాచీన కాలంలో వేదాల ప్రామాణికతను ప్రశ్నించి, దేవుడి ప్రధానంగా కాక నైతికత ప్రధానంగా ముందుకొచ్చి, ప్రజల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని ప్రచారం చేసిన గౌతమ బుద్ధుడు తన గురువుల్లో ఒకరుగా అంబేడ్కర్‌ ప్రకటించారు. అలాగే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఉన్నతమైన భావాలను తాను ఫ్రెంచి విప్లవం నుంచి కాక బౌద్ధం నుంచి గ్రహించినట్లు అంబేడ్కర్‌ చెప్పుకున్నారు. ఇతర మత ప్రవక్తలందరూ తాము దేవుని కుమారులమని, దేవదూతలమని, తామే దేవుళ్ళమని ప్రకటించుకుంటే బుద్ధుడి ధర్మంలో దేవుడికి స్థానం లేదని అంబేడ్కర్‌ అంటారు. బుద్ధుడు మనిషి నైతిక ప్రవర్తనను ఉన్నతంగా చేసే విధంగా తన సిద్ధాంతాన్ని రూపొందించాడని, ఆ కారణంగానే తాను బౌద్ధాన్ని అభిమానించినట్లు అంబేడ్కర్‌ చెప్పారు.
 
తాను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం మరణించనని యోలా సభలో ప్రకటించాడు. అంబేడ్కర్‌ 1956 అక్టోబర్‌ 14న నాగపూర్‌లో తన లక్షలాది సహచరులతో బర్మా దేశానికి చెందిన భిక్షువు చంద్రమణి చేతుల మీదుగా బౌద్ధాన్ని స్వీకరించి మరో సామాజిక విప్లవానికి నాంది పలికారు. అంబేద్కర్‌ తన దీక్ష అనంతరం మరుసటి రోజు అదే స్థలంలో తానే స్వయంగా తన సహచరులకు దీక్షనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారితో త్రిశరణాలతో పాటు మరో 22 ప్రమాణాలు చేయించారు. క్రైస్తవ మతానికి బైబిల్‌ వున్నట్లు బౌద్ధ ధర్మ సారాంశాన్ని ఒక గ్రంథంగా రూపొందించాలని ఆయన చేసిన కృషి ‘బుద్ధ అండ్‌ హిస్‌ ధమ్మా’ పేరుతో ఆయన మరణానంతరం వెలుగు చూసింది.
 
బుద్ధుడి జీవితం, బోధనలపై సంప్రదాయవాదులైన బౌద్ధ పండితులు విశ్లేషించే పద్ధతికి భిన్నంగా అంబేద్కర్‌ బౌద్ధాన్ని ఈ పుస్తకంలో విశ్లేషించాడు. ఇతర మతాలలోని సన్యాసులవలే కాకుండా బౌద్ధ బిక్షువులు సమాజంలో క్రియాశీలక కార్యకర్తలుగా ఉండి, బుద్ధుడి సందేశమైన బహుజన హితం, బహుజన సుఖం కోసం పనిచెయ్యాలని సూచించారు. ఆయన ఈ పుస్తక రచనలో చరిత్ర, మానవ శాసా్త్రల విశ్లేషణా పద్ధతులను పాటించారు. తన దీక్ష సందర్భంగా ఒక జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనదైన బౌద్ధానికి ‘నవయానం’ అనే పేరును అంబేడ్కర్‌ సూచించారు. భారతదేశంలో తనకంటే ముందు బౌద్ధాన్ని బ్రాహ్మణేతర దృక్పథం నుంచి పరిశీలించిన ప్రొఫెసర్‌ లక్ష్మీనరుసు రచించిన ‘ఎసెన్స్‌ ఆఫ్‌ బుద్ధిజం’ అనే పుస్తకానికి పీఠిక రాసి 1948లో తిరిగి ముద్రించారు. బుద్ధుడిని హిందూమతంలో భాగం అనుకొనే రోజుల్లో ప్రజల భ్రమల్ని తొలగించే మంచి పుస్తకంగా లక్షీనరుసు గ్రంథాన్ని అంబేడ్కర్‌ పేర్కొన్నాడు. నిజానికి ఆయన చేసిన ప్రయత్నం కూడా అటువంటిదే! అంబేడ్కర్‌ భారతదేశాన్ని బౌద్ధదేశంగా పరిగణించి బ్రాహ్మణ వాదుల ప్రతీఘాత విప్లవంతో దేశం నుంచి నిష్క్రమించిన బౌద్ధాన్ని తిరిగి ఇక్కడ ప్రతిష్టించాలని కలగన్నారు. ‘భారతీయత’ అనేది బౌద్ధంలోనే ఉందని చెప్పడానికి ఆయన రాజ్యాంగ రచనను ఉపయోగించుకున్నారు. బౌద్ధ చిహ్నాలైన అశోకుడి సారనాథ్‌ స్తంభాన్ని, ధర్మచక్రాన్ని ఈ దేశపు చిహ్నాలుగా రాజ్యాంగంలో పేర్కొన్నారు. ‘పంచశీల’ భావన కూడా బౌద్ధం లోనిదే. రాజ్యాంగ రచనలోనూ, హిందూకోడ్‌ బిల్లును తయారు చెయ్యడంలోనూ అంబేడ్కర్‌ పైన బౌద్ధ ధర్మ ప్రభావం కనిపిస్తుంది. అంబేడ్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంబేడ్కర్‌ ‘బుద్ధ ఆర్‌ కార్ల్‌మార్క్స్‌’ అనే పుస్తకంలో కార్ల్‌ మార్క్స్‌ సోషలిజం కంటే బుద్ధుడు ప్రతిపాదించిన అహింసాయుతమైన సమానత్వ భావన గొప్పదని పేర్కొనడం, బౌద్ధ ధర్మ దీక్ష తీసుకోవడంపైన మార్క్సిస్టులు ఆయన పై తీవ్ర అసంతృప్తి చెందారు.
 
అంబేడ్కర్‌ బౌద్ధం పై చేసిన లోతైన పరిశోధన, ఆయన బౌద్ధాన్ని విశ్లేషించిన తీరు వలన ప్రపంచం తిరిగి బౌద్ధం వైపు చూస్తున్నది. మహారాష్ట్రలో బౌద్ధాన్ని అవలంబించే దళితులు అంబేడ్కర్‌ అనంతరం గతంలోని తమ కులపరమైన గుర్తింపును వదిలిపెట్టి ‘నియో బుద్ధిస్ట్‌’ అనే సామాజిక గుర్తింపును పొందారు. దళితుల రాజ్యాధికారం అనేది వారి బౌద్ధమత గుర్తింపు ద్వారానే సాధ్యమవుతుందని అంబేడ్కర్‌ వాదులు భావిస్తున్నారు. సామాజిక, రాజకీయ రంగాలలో దళితుల పరాధీనత అనే సమస్యకు అంబేడ్కర్‌ బౌద్ధంలో పరిష్కారాన్ని వెదికినట్లే హిందూ సామ్రాజ్య వాదానికి బౌద్ధం సమాధానం చెప్పగలదని భావిస్తున్నారు. ఆయన బౌద్ధ ధర్మదీక్ష ఈ దేశంలో సాంస్కృతికరంగంలో ఫాసిస్ట్‌ అణచివేతకు గురవుతున్న హైందవేతరులందరికి స్ఫూర్తిదాయకం.
చల్లపల్లి స్వరూపరాణి
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
(అంబేడ్కర్‌ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి నేటికి యాభయ్యేళ్లు) 
ఆంధ్రజ్యోతి  (14-10-2016) సౌజన్యంతో

బుద్ధి ఎక్కడ పనిచేస్తే అక్కడ భక్తి నిలవదు!

నాదం, రాగం, లయ, మ్యూజిక్‌, ఫ్రీక్వెన్సీ, వేవ్‌లెన్త్‌ అన్నీ సైన్సే! ఇవన్నీ శరీరంలో ఎముకల లాంటివి. లోన ఉన్నవాటిని గమనించం. కండ, చర్మం చూసి అందం బేరీజు వేస్తాం. ఎలక్ట్రిక్‌ బల్బు ఎంత అందంగా ఉన్నా, లోన ఫిలమెంట్‌ పోతే బల్బు పనికిరాదు. ఫిలమెంట్‌ సైన్స్‌ ప్రిన్సిపల్‌ మీద తయారయ్యింది. గాజు బల్బూ సైన్సు వల్ల వచ్చిందే. మనవాళ్లు గుళ్ళూ, గోపురాలు చూసి ఆనాటి ఇంజనీరింగ్‌ ప్రతిభ గుర్తించరు. అందులో కల్పించుకున్న ఒక దేవుణ్ణి, శక్తిని... వారి మహత్మ్యాల్ని ప్రవచిస్తుంటారు. వారికి వారే పరవశించిపోతుంటారు. రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అవే పాత కథలు. మనిషి ఔన్నత్యం ఎక్కడైనా కనిపిస్తుందా? మనిషి, దైవత్వానికి దాసోహం అయిన గాథలు మహోన్నతంగా చెప్పడమే గానీ మరొకటుందా? దైనందిన జీవితంలో దేవుడి ప్రసక్తి, సంభాషణల్లో దైవం, హితబోధలో దైవం, సంగీతంలో దైవం, సాహిత్యంలో దైవం, నాట్యంలో దైవం... మనిషి ఆత్మవిశ్వాసం దెబ్బతీసే కళారూపాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నప్పుడు, తరతరాలకు ఆ జాడ్యం వ్యాపించక ఏమవుతుందీ? ఇవన్నీ చాలవన్నట్టు ప్రవచాల పేరుతో కొందరు తమ తుప్పుపట్టిన భావజాలం ప్రచారం చేస్తుంటారు. మనుస్మృతిలోని విషయాలే గొప్పగా చేసి వర్ణిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆధునిక ఆలోచనా ధోరణికి ఏమాత్రం సరిపడని విషయాలు కదా?