22, డిసెంబర్ 2016, గురువారం

అంబేడ్కర్‌ బౌద్ధ స్వప్నం - నవయానం

అంబేడ్కర్‌ భారతదేశాన్ని బౌద్ధదేశంగా పరిగణించారు. దేశం నుంచి నిష్క్రమించిన బౌద్ధాన్ని తిరిగి ప్రతిష్టించాలని ప్రగాఢంగా ఆకాంక్షించారు. బౌద్ధాన్ని అంబేడ్కర్‌ విశ్లేషించిన తీరు వలన ప్రపంచం తిరిగి బౌద్ధం వైపు చూస్తోంది.


‘పీడిత కులస్థులు ఎప్పుడూ తమ అస్తిత్వ పునాదులపై నిలబడి పోరాడాలి తప్ప ఆధిపత్య మతాలలోకి కాందిశీకులుగా వెళ్ళకూడద’ని తమిళ దళిత బౌద్ధ ఉద్యమకారుడు పండిత అయోతీదాస్‌ అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించడానికి దశాబ్దాల ముందే అయోతీదాస్‌ ఈ సత్యాన్ని చెప్పారు.
అంబేడ్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించడం భారతదేశ బౌద్ధ మత చరిత్రలోనే ఓ కీలకమైన అధ్యాయం. బౌద్ధాన్ని ఇతరులు అర్థం చేసుకునే విధానానికీ అంబేడ్కర్‌ పరిశీలించిన పద్ధతికీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. గాంధీ, వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి వారు బుద్ధుడిని హిందూ మతంలో భాగంగా పరిగణిస్తారు. కానీ అంబేడ్కర్‌, బుద్ధుడిని బ్రాహ్మణ వాదాన్ని సవాల్‌ చేసి బ్రాహ్మణేతర తాత్విక ధోరణిని ప్రవేశ పెట్టిన సామాజిక విప్లవకారుడిగా పరిగణిస్తాడు. అంతేకాదు సామాజిక విప్లవంగా ముందుకొచ్చిన బౌద్ధాన్ని అంతమొందించి దాని స్థానంలో హిందూ మతాన్ని, దానికి అనుబంధంగా కులవ్యవస్థను స్థిరీకరించి, సామాజిక అంతరాలను చట్టబద్ధం చెయ్యడానికి బ్రాహ్మణవాదులు చేసిన ప్రయత్నాలను ‘ప్రతీఘాత విప్లవం’ గా అంబేద్కర్‌ అభివర్ణించారు.
 
ప్రాచీన కాలంలో వేదాల ప్రామాణికతను ప్రశ్నించి, దేవుడి ప్రధానంగా కాక నైతికత ప్రధానంగా ముందుకొచ్చి, ప్రజల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని ప్రచారం చేసిన గౌతమ బుద్ధుడు తన గురువుల్లో ఒకరుగా అంబేడ్కర్‌ ప్రకటించారు. అలాగే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఉన్నతమైన భావాలను తాను ఫ్రెంచి విప్లవం నుంచి కాక బౌద్ధం నుంచి గ్రహించినట్లు అంబేడ్కర్‌ చెప్పుకున్నారు. ఇతర మత ప్రవక్తలందరూ తాము దేవుని కుమారులమని, దేవదూతలమని, తామే దేవుళ్ళమని ప్రకటించుకుంటే బుద్ధుడి ధర్మంలో దేవుడికి స్థానం లేదని అంబేడ్కర్‌ అంటారు. బుద్ధుడు మనిషి నైతిక ప్రవర్తనను ఉన్నతంగా చేసే విధంగా తన సిద్ధాంతాన్ని రూపొందించాడని, ఆ కారణంగానే తాను బౌద్ధాన్ని అభిమానించినట్లు అంబేడ్కర్‌ చెప్పారు.
 
తాను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం మరణించనని యోలా సభలో ప్రకటించాడు. అంబేడ్కర్‌ 1956 అక్టోబర్‌ 14న నాగపూర్‌లో తన లక్షలాది సహచరులతో బర్మా దేశానికి చెందిన భిక్షువు చంద్రమణి చేతుల మీదుగా బౌద్ధాన్ని స్వీకరించి మరో సామాజిక విప్లవానికి నాంది పలికారు. అంబేద్కర్‌ తన దీక్ష అనంతరం మరుసటి రోజు అదే స్థలంలో తానే స్వయంగా తన సహచరులకు దీక్షనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారితో త్రిశరణాలతో పాటు మరో 22 ప్రమాణాలు చేయించారు. క్రైస్తవ మతానికి బైబిల్‌ వున్నట్లు బౌద్ధ ధర్మ సారాంశాన్ని ఒక గ్రంథంగా రూపొందించాలని ఆయన చేసిన కృషి ‘బుద్ధ అండ్‌ హిస్‌ ధమ్మా’ పేరుతో ఆయన మరణానంతరం వెలుగు చూసింది.
 
బుద్ధుడి జీవితం, బోధనలపై సంప్రదాయవాదులైన బౌద్ధ పండితులు విశ్లేషించే పద్ధతికి భిన్నంగా అంబేద్కర్‌ బౌద్ధాన్ని ఈ పుస్తకంలో విశ్లేషించాడు. ఇతర మతాలలోని సన్యాసులవలే కాకుండా బౌద్ధ బిక్షువులు సమాజంలో క్రియాశీలక కార్యకర్తలుగా ఉండి, బుద్ధుడి సందేశమైన బహుజన హితం, బహుజన సుఖం కోసం పనిచెయ్యాలని సూచించారు. ఆయన ఈ పుస్తక రచనలో చరిత్ర, మానవ శాసా్త్రల విశ్లేషణా పద్ధతులను పాటించారు. తన దీక్ష సందర్భంగా ఒక జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనదైన బౌద్ధానికి ‘నవయానం’ అనే పేరును అంబేడ్కర్‌ సూచించారు. భారతదేశంలో తనకంటే ముందు బౌద్ధాన్ని బ్రాహ్మణేతర దృక్పథం నుంచి పరిశీలించిన ప్రొఫెసర్‌ లక్ష్మీనరుసు రచించిన ‘ఎసెన్స్‌ ఆఫ్‌ బుద్ధిజం’ అనే పుస్తకానికి పీఠిక రాసి 1948లో తిరిగి ముద్రించారు. బుద్ధుడిని హిందూమతంలో భాగం అనుకొనే రోజుల్లో ప్రజల భ్రమల్ని తొలగించే మంచి పుస్తకంగా లక్షీనరుసు గ్రంథాన్ని అంబేడ్కర్‌ పేర్కొన్నాడు. నిజానికి ఆయన చేసిన ప్రయత్నం కూడా అటువంటిదే! అంబేడ్కర్‌ భారతదేశాన్ని బౌద్ధదేశంగా పరిగణించి బ్రాహ్మణ వాదుల ప్రతీఘాత విప్లవంతో దేశం నుంచి నిష్క్రమించిన బౌద్ధాన్ని తిరిగి ఇక్కడ ప్రతిష్టించాలని కలగన్నారు. ‘భారతీయత’ అనేది బౌద్ధంలోనే ఉందని చెప్పడానికి ఆయన రాజ్యాంగ రచనను ఉపయోగించుకున్నారు. బౌద్ధ చిహ్నాలైన అశోకుడి సారనాథ్‌ స్తంభాన్ని, ధర్మచక్రాన్ని ఈ దేశపు చిహ్నాలుగా రాజ్యాంగంలో పేర్కొన్నారు. ‘పంచశీల’ భావన కూడా బౌద్ధం లోనిదే. రాజ్యాంగ రచనలోనూ, హిందూకోడ్‌ బిల్లును తయారు చెయ్యడంలోనూ అంబేడ్కర్‌ పైన బౌద్ధ ధర్మ ప్రభావం కనిపిస్తుంది. అంబేడ్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంబేడ్కర్‌ ‘బుద్ధ ఆర్‌ కార్ల్‌మార్క్స్‌’ అనే పుస్తకంలో కార్ల్‌ మార్క్స్‌ సోషలిజం కంటే బుద్ధుడు ప్రతిపాదించిన అహింసాయుతమైన సమానత్వ భావన గొప్పదని పేర్కొనడం, బౌద్ధ ధర్మ దీక్ష తీసుకోవడంపైన మార్క్సిస్టులు ఆయన పై తీవ్ర అసంతృప్తి చెందారు.
 
అంబేడ్కర్‌ బౌద్ధం పై చేసిన లోతైన పరిశోధన, ఆయన బౌద్ధాన్ని విశ్లేషించిన తీరు వలన ప్రపంచం తిరిగి బౌద్ధం వైపు చూస్తున్నది. మహారాష్ట్రలో బౌద్ధాన్ని అవలంబించే దళితులు అంబేడ్కర్‌ అనంతరం గతంలోని తమ కులపరమైన గుర్తింపును వదిలిపెట్టి ‘నియో బుద్ధిస్ట్‌’ అనే సామాజిక గుర్తింపును పొందారు. దళితుల రాజ్యాధికారం అనేది వారి బౌద్ధమత గుర్తింపు ద్వారానే సాధ్యమవుతుందని అంబేడ్కర్‌ వాదులు భావిస్తున్నారు. సామాజిక, రాజకీయ రంగాలలో దళితుల పరాధీనత అనే సమస్యకు అంబేడ్కర్‌ బౌద్ధంలో పరిష్కారాన్ని వెదికినట్లే హిందూ సామ్రాజ్య వాదానికి బౌద్ధం సమాధానం చెప్పగలదని భావిస్తున్నారు. ఆయన బౌద్ధ ధర్మదీక్ష ఈ దేశంలో సాంస్కృతికరంగంలో ఫాసిస్ట్‌ అణచివేతకు గురవుతున్న హైందవేతరులందరికి స్ఫూర్తిదాయకం.
చల్లపల్లి స్వరూపరాణి
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
(అంబేడ్కర్‌ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి నేటికి యాభయ్యేళ్లు) 
ఆంధ్రజ్యోతి  (14-10-2016) సౌజన్యంతో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి