డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన యావజ్జీ వితం నిమ్న జాతుల అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, వారికి పరిపాలనలో భాగం కోసం పోరాటం చేశారు. బాల్యం నుంచి అనేక సందర్భాల్లో, ఎన్నో నిందలు, అవమానాలు పొంది, అగ్నిశిఖలా ఎగిసిన ప్రపంచ స్థాయి మేథావి ఆయన. మనుధర్మాన్ని చీల్చి చెండాడి, కులం యొక్క వివక్ష విశ్వరూపాన్ని అనేక పార్శ్వాల్లో ఆవిష్కరించిన తత్త్వవేత్త. భారతదేశం గురించి విశేష పరిశోధన చేసిన దార్శనికుడు. దార్శనికతతో ఆయన చేసిన కృషి అనితర సాధ్యం. రాజ్యాంగ నిర్మాతగా, రిజర్వేషన్ సాధించిన మహనీయునిగా ఆయన గురించి జరిగినంత ప్రచారం, మిగతా అంశాల్లో జరగలేదు. ఆయన 'ప్రాతినిధ్యం' అన్న పదాన్ని మాత్రమే వాడారు తప్ప 'రిజర్వేషన్స్' అనే పదం వాడలేదు. జీవిత చరమాంకంలో బౌద్ధమతాన్ని స్వీకరించి, బుద్ధుని యెడల తన దృక్పథం మహాయానం, హీనయానం కాదని, 'నవయానం' అని ధైర్మంగా చాటిన బౌద్ధ భిక్షువు అంబేద్కర్.
ఆయన 125వ జయంతిని ఈ ఏడాది దేశమంతటా ఘనంగా జరపాలని అనేక సంస్థలు భావించి తమదైన శైలిలో నివాళ్లర్పిస్తున్నాయి. ప్రజానాట్య మండలి, తెలంగాణ రాష్ట్ర శాఖ 'సంఘం శరణం గచ్ఛామి' పేరిట ఒక కళారూపాల కదంబాన్ని ప్రదర్శిస్తోంది. 25 మంది కళాకారులతో ప్రొడక్షన్ క్యాంప్ నిర్వహించి తొలి ప్రదర్శనను ఏప్రిల్ 14న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో కిక్కిరిసిన ప్రేక్షక సందోహం మధ్య ఇచ్చారు.
21 సీన్లతో, 13 పాటలతో ఈ సంగీత రూపకాన్ని రచించారు ప్రజాకవి 'దేవేంద్ర'. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్‌డిఎం.రాజు వాయిస్ ఓవర్‌తో, సంగీత దర్శకులు ఇస్మాయిల్ గోనాల్ స్వరకల్పనలో, రవి కల్యాణ్ సంగీత సారథ్యంలో అన్ని పాటలూ సిడి రూపంలో రూపుదిద్దుకున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్‌కి చెందిన శివప్రసాద్ తూము దర్శకత్వం వహించారు. ఈ రూపకాన్ని గంటసేపు ఆద్యంతం రసవత్తరంగా ప్రజాకళాకారులు ద్రర్శించారు.
రూపకం ప్రారంభంలో ... అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు సాగుతూ ఉంటాయి. నిర్వాహకుడొకరు వచ్చి ఆశీనులైన ప్రేక్షకులతో - జరగబోయే కార్యక్రమాన్ని వివరించి కళాకారులను ఓ పాటను అభినయించమంటారు. కళాకారుల ప్రదర్శన సాగుతుండగా, ప్రజా ప్రతినిధులు రావడంతో మధ్యలో ఆపేయమంటారు నిర్వాహకులు. సణుక్కుంటూ వేదిక దిగుతారు కళాకారులు. విగ్రహావిష్కరణకు ముందు ఉపన్యాసాలు సాగుతాయి. ముఖ్య అతిథి అయిన మంత్రి వేరే పనుండి గాబట్టి- రెండే మాటలు మాట్లాడతానంటూ 'అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు, మిగిలినవి ఎన్ని చేసినా ఇవే ముఖ్యమైనవి..' అంటాడు. విగ్రహానికి దండ వేసి నినాదాల హౌరుతో శిరస్సు వంచి ఓ నమస్కారం చేస్తాడు. అంబేద్కర్ విగ్రహానికి జీవం వచ్చి, రాజ్యాంగం పుస్తకంతో మంత్రి నెత్తి మీద తడతాడు. అందరూ ఉలిక్కి పడతారు. అంబేద్కర్ దండను నినాదాలిస్తున్న కార్యకర్తలకు అందించి- గంభీరంగా మెట్లు దిగుతాడు.
రాజ్యాంగాన్ని టేబుల్‌పై పెట్టి- ఇలా మాట్లాడతాడు : 'అరవై ఏళ్లుగా విన్న మాటలే వినీ మళ్లీ మళ్లీ విని చెవులు దిబ్బళ్లు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరులేని వాళ్లకు నోరై పోరాడాను. పీడితుల కోసం, అణగారిన వర్గాల, మైనార్టీల అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి- నా మరణానికి ముందు చేసిన రెండు పనులనే 'రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్ తెచ్చాడు' అంటూ ఇంకా ఎన్నేళ్లు చెబుతారు? ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేను ఆవిష్కరించుకోవాలి.. దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికలను ఆవిష్కరించుకోవాలి.' అంటూ ముందుకు వస్తాడు. అప్పుడు ...
'యుగాల తరబడి అణచివేతపై
తిరుగుబాటురా అంబేద్కర్
తరాల బానిస స్వరాల ఘోషల
భాషకు రూపం అంబేద్కర్
నరాల సత్తువ వరాల వానకు
విషాద రాగపు సువర్ణ వీణ
అణగారిన చేతుల పిడికిళ్లకు
శక్తినిచ్చే స్ఫూర్తుల వాన' అంటూ రూపకం మొదలై ... దాదాపు గంటసేపు అవిశ్రాంతంగా నడుస్తుంది
బాల్యం, పేదరికం, తండ్రి మరణం, బరోడా మహారాజు ఆర్థిక సహాయం, అమెరికా పయనం, రమాబాయితో వివాహం, అర్థంతరంగా చదువు వదిలి స్వదేశాగమనం, బహిష్క ృత హితకారిణీ సంస్థ, సమాజ సమతాదళ్ ఏర్పాటు, చౌదార్ చెరువు సంఘటన, సవర్ణులపై చారిత్రాత్మక విజయం, మనుధర్మ పుస్తకం అగ్నికి ఆహుతి చేయడం, అంబేద్కర్, గాంధీల సమావేశం, చర్చలు విఫలమవ్వడం, పూనే ఒప్పందం, ఎరవాడ జైల్లో గాంధీతో భేటీ, రమాబాయి మరణం, కుల నిర్మూలన పుస్తక రచనకు మూలం, రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావం, న్యాయ శాఖామంత్రి పదవీ స్వీకరణ, హిందూ కోడ్ బిల్లు వల్ల మహిళలకు అన్యాయంలో రాజీనామా; రాజ్యాంగ రచన, బౌద్ధమత స్వీకరణ తదితర జీవిత ఘట్టాలను వివరిస్తూ ... సాగుతోంది రూపకం.
ఆడియో అంతా ముందే రికార్డు అవ్వడం వల్ల కళాకారుల వాచికాభినయానికి అంత అవకాశం లేదు. ఏ ప్రాంత కళాకారులైనా రూపకాన్ని సిడి సహాయంతో ప్రదర్శించవచ్చు. సురభి టెక్నీషియన్స్ సహాయంతో సెట్టింగ్ చాలా సింపుల్‌గా నిర్మించారు. వాయిస్ ఓవర్, పాటలలో ఎక్కడా ఆగకుండా నడిచే ఈ రూపకంలో ఇద్దరు అంబేద్కర్ పాత్రధారులు ఉన్నారు. విగ్రహం రూపంలో ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.జగ్గరాజు నటించగా- కథనంలో మరో నటుడు నటించారు.
20 సీన్ల కథనం తర్వాత అంబేద్కర్ విగ్రహంతో ఆఖరి సీన్ వస్తుంది. 'జయంతులు, వర్థంతులు అంటూ రెండు రోజులు మాత్రమే గుర్తుంచుకుని, మిగతా 363 రోజులూ విస్మరిస్తారా? తాను ఏ ఆశయంతో పోరాడాడో వాటి గురించి పోరాడేది ఎవరు? నెరవేర్చేది ఎవరు? నాయకులైన మీరేనా?' అని అడగగా రాజకీయ నాయకులు మౌనంగా ఉండిపోతారు. అక్కడ ఉన్న యువత, 'మేమున్నాం అంబేద్కర్' అంటూ ముందుకు వస్తారు. అంబేద్కర్ వారందరినీ తల నిమురుతూ కౌగిలించుకుంటూ, గంభీరంగా పీఠం మీదకు వెళ్లి శిలగా మారిపోతాడు. యువతీయువకులు తమ చేతిలోని దండను అంబేద్కర్ విగ్రహానికి వేసి- 'అంతమెరగని స్వాతంత్య్రానికి, కులమత భేదం దరికి చేరని ఆధిపత్యాలు వివక్షతలు దుంప నాశనం చేసేవరకూ .... కదిలింది యువత- నిర్మించగ సుందర భవిత' అంటూ గానంతో రూపకం ముగుస్తుంది.
ఈ రూపకంలో కొన్నిచోట్ల ఉపన్యాసంగా అన్పించినా, ఒక జీవిత కాలాన్ని ఒక్కగంటలో చెప్పేటప్పుడు కొన్ని సర్దుబాట్లు తప్పవు. ఈ రూపకంలో అంబేద్కర్ మొదటి భార్య రమాభాయి గొప్పదనాన్ని ఎంతో హృద్యంగా; మరణాన్ని ఎంతో విషాదపూరితంగా చూపారు. ఆమె మరణం తర్వాత 11 ఏళ్ల అనంతరం, అప్పటికే అనేక అనారోగ్య సమస్యలు ఎదురై, ఒంటరితనంతో ఉన్న అంబేద్కర్ జీవితంలోకి రెండో భార్యగా డాక్టర్ సవితాదేవి వచ్చారు. రాజ్యాంగ రచనా సమయంలో, అంబేద్కర్ అవసాన దశలో కంటిరెప్పలా చూసుకున్నారు. ఆమె ప్రస్తావన ఎక్కడా రాకపోవడం లోపంగానే భావించాలి.
ఈ రూపకం ఉన్న పుస్తకం, రూపకంతో పాటు మరో 14 పాటలు పొందుపరచిన డివిడిని కలిపి రూ.100లకు అందిస్తున్నారు. వాటికోసం తెలంగాణా రాష్ట్ర థియేటర్ సబ్ కమిటీని సంప్రదించవచ్చు. పుస్తకానికి ముందుమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు రాశారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు తమ సందేశం ఇచ్చారు.
- డాక్టర్ శమంతకమణి
94919 62638
ప్రజాశక్తి ( ) సౌజన్యం తో

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి